హాస్యనటుడు సంతానం హత్య చేయడానికి ప్రయత్నించాడంటూ కేసు నమోదు.. ఇంతకూ ఏమి జరిగింది..!

ప్రముఖ హాస్యనటుడు సంతానం తాజాగా వివాదంలో ఇరుక్కున్నాడు. లావాదేవీల విషయంలో వచ్చిన గొడవలు కాస్తా పిడిగుద్దులు కురిపించుకునేదాకా వెళ్ళాయి. ఈ వివాదంలో ఓ రాజకీయ నాయకుడు, కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. కమెడియన్ సంతానం చెన్నై లోని వలసరవాక్కం ప్రాంతానికి చెందిన షణ్ముగ సుందరంతో కలసి షాపింగ్ మాల్ కట్టించాలని అనుకున్నాడు. తాను ఇంత పెట్టుబడి పెడుతున్నానని చెప్పి సంతానం తన వాటా మొదట్లోనే ఇచ్చేశాడట.

అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో సంతానం వారితో పార్ట్ నర్ షిప్ వద్దని అనుకున్నాడు. కొంత డబ్బు తిరిగి ఇచ్చిన షణ్ముగ సుందరం మిగతా మొత్తాన్ని ఎప్పుడు అడిగినా ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతుండేవాడు. ఆ తర్వాత వారిని కలుద్దామని తన మేనేజర్ రమేష్ తో కలిసి సంతానం నేరుగా ఆయన కార్యాలయానికి వెళ్లాడు.

ఈ సమయంలో అక్కడ షణ్ముగసుందరంతో పాటు, ఆయన మిత్రుడు, స్థానిక బీజేపీ నాయకుడు ప్రేమానంద్‌ కూడా అక్కడే ఉన్నారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణకు దారితీసింది. ఆ గొడవలో ముగ్గురూ గాయపడడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు. ప్రేమానంద్ గాయపడ్డాడని తెలుసుకున్న కార్యకర్తలు, ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అనంతరం స్థానిక స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు చేసి, స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. 294బి, 324, 506ఐ సెక్షన్ల ప్రకారం సంతానంపై కేసు నమోదు చేశారు.

ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సంతానంను పోలీసులు వెతుకుతున్నారు. అయితే వారు తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని ముందస్తు బెయిల్ కోసం సంతానం దరఖాస్తు చేసుకున్నాడు.

About the author

Related

JOIN THE DISCUSSION