యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం డార్జిలింగ్ వెళ్లిన యువ‌తి.. అదృశ్యం!

ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం డార్జిలింగ్‌కు వెళ్లిన హైద‌రాబాద్ యువతి అదృశ్యమైంది. హైదరాబాద్ విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన కోటేశ్వర్‌రావు కుమార్తె షణ్ముక ప్రియ. వ‌యస్సు 18 సంవ‌త్స‌రాలు. ఇంటర్ పూర్చి చేసిన ష‌ణ్ముఖ‌ప్రియ యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్స్ దగ్గర కో-డైరెక్టర్ గా పనిచేస్తోంది. కమల్ సేతు అనే దర్శకుడి వ‌ద్ద యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.

దీనికోసం ఆమె డార్జిలింగ్‌కు కింద‌టి నెల 17వ తేదీన డార్జిలింగ్ బయలుదేరింది. ఆమె తల్లి ఉషాకుమారి స్వయంగా.. షణ్ముక ప్రియను శంషాబాద్ విమానాశ్ర‌యంలో వదిలి వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం షణ్ముక ప్రియ త‌ల్లికి ఫోన్ చేసింది. తాను క్షేమంగా కోల్‌కతాకు చేరుకున్నానని వెల్ల‌డించింది.

అదే నెల 28వ తేదీన షూటింగ్ ముగుస్తుంద‌ని, డార్జిలింగ్ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు వ‌స్తాన‌ని తెలియ‌జేసింది. అదే ఆమె చివ‌రి ఫోన్ కాల్‌. ఆ త‌రువాత ఆమె వ‌ద్ద నుంచి ఎలాంటి స‌మాచారం రాలేదు. ఆమె కూడా రాలేదు. త‌ల్లిదండ్రులు ప‌లుమార్లు ఫోన్ చేసిన‌ప్ప‌టికీ స్విచ్‌ ఆఫ్ అనే స‌మాధాన‌మే వినిపించింది.

దీనితో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. దీనిపై రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షణ్ముఖప్రియ డార్జిలింగ్ చేరుకుందా? లేదా? అనే విష‌యం తేలాల్సి ఉంది. దీనికోసం కోల్‌క‌త‌, డార్జిలింగ్‌కు రెండు వేర్వేరు బృందాల‌ను పంపించ‌డానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కింద‌టి నెల 17వ తేదీన ష‌ణ్ముఖ‌ప్రియ అదృశ్య‌మైతే.. ఇన్ని రోజులూ త‌ల్లిదండ్రులు ఎందుకు ఫిర్యాదు చేయలేద‌నే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. యాడ్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ కమల్ సేతును కూడా విచారిస్తామ‌ని అన్నారు. ఒక్క ష‌ణ్ముఖ ప్రియే అదృశ్య‌మైందా? మిగిలిన యూనిట్ సంగ‌తేమిట‌న్న‌ది త్వ‌ర‌లోనే తేలుతుంద‌ని చెప్పారు.

About the author

Related

JOIN THE DISCUSSION