ఆ చిన్నారికి కాళ్లూ, చేతులు లేవు..అయినా..!

ఆ చిన్నారి వ‌య‌స్సు మ‌హా అయితే మూడేళ్ల‌కు మించ‌వు. కాళ్లూ, చేతులు లేవు. కేవ‌లం న‌డుం, మొండెం, త‌ల మాత్ర‌మే ఉన్నాయి ఆ చిన్నారికి. అయిన‌ప్ప‌టికీ.. జారుడుబ‌ల్ల ఆట ఆడ‌టానికి ఆ చిన్నారి చేసిన సాహ‌సం..స్ఫూర్తి ర‌గిలిస్తోంది. ఎన్ని స‌వాళ్ల‌న‌యినా అధిగ‌మించే శ‌క్తి ఇస్తోంది.

కాళ్లూ, చేతులు లేక‌పోయినా ఒక్కో మెట్టును ఎంతో క‌ష్టంగా అధిగ‌మిస్తూ.. త‌న ల‌క్ష్యాన్ని చేరుకుంటోన్న ఆ చిన్నారి ప్ర‌తి ఒక్కరికీ ఓ గుణ‌పాఠాన్ని నేర్పుతోంది. త‌న‌తో పాటు ఉన్న మ‌రో పాప జారుడుబ‌ల్ల ఆట‌ను ఆనందంగా ఆడుకుంటుండ‌టాన్ని చూసిన ఆ చిన్నారి.. `నేనెందుకు ఆడ‌కూడ‌దు. అది నా వ‌ళ్ల కాదా? ఎందుక్కాదో చూస్తాను..` అనే ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శించింది.

అడుగెత్తులో ఉన్న మెట్టును అతి క‌ష్టం మీద ఎక్కిందా చిన్నారి. ఎక్క‌డా తొట్రుపాటు లేదు. ప‌ట్టు జార‌లేదు. ల‌క్ష్యాన్ని అందుకుంది. చిరున‌వ్వులు చిందిస్తూ జారుడుబ‌ల్ల మీది నుంచి ఆనందంగా జారుతూ కిందికొచ్చింది. ఆ చిన్నారి ఆత్మ‌స్థైర్యం ముందు అంగవైకల్యం కూడా చిన్నబోయింది.

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌లా మారింది. నెటిజ‌న్లు ఆ చిన్నారిపై ప్ర‌శంస‌ల వ‌ర్షాన్ని కురిపిస్తున్నారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సైతం.. ఆ చిన్నారి నుంచి స్ఫూర్తి పొందినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఆ చిన్నారి కష్టం చూశాక ప్రపంచంలో మరేదీ కష్టం అనిపించదని మహీంద్రా తెలిపారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి వీడియోను ఆయన షేర్‌ చేశారు. ఆ చిన్నారిలో స్ఫూర్తి నింపిన త‌ల్లిదండ్రుల‌ను కూడా నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. ప్ర‌తి త‌ల్లి కూడా త‌మ పిల్ల‌ల‌ను ఆ విధంగా పెంచాల‌ని చెబుతున్నారు.

 

About the author

Related

JOIN THE DISCUSSION