యువ‌తిని లైంగికంగా వేధించి..దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి..

ఓ యువ‌తిని లైంగికంగా వేధిస్తున్న ఘ‌ట‌న‌ను వీడియో తీసి, దాన్ని సోష‌ల్ మీడియాలో పెట్టిన దారుణ ఉదంతం ప్ర‌కాశం జిల్లాలో దుమారం రేపుతోంది. ఆ యువతి ప్రేమికుడే ఇందులో ప్ర‌ధాన నిందితుడు. తన స్నేహితుడితో లైంగిక దాడికి పంపించిన ఆ ప్రియుడు.. స్వ‌యంగా తానే దాన్ని వీడియో తీశాడు.

దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ ప్రేమికుడి పేరు కార్తీక్‌. బాధిత యువ‌తి క‌నిగిరిలో డిగ్రీ చ‌దువుతోంది. కార్తీక్‌ అనే యువకుడిని ఆమె ప్రేమిస్తోంది. కొద్దిరోజులుగా ఆమెపై అనుమానం పెంచుకున్నాడు కార్తీక్‌. ఆ అనుమానం కాస్త పెనుభూత‌మైంది.

ఆమె ఇంకెవ‌రినో ప్రేమిస్తోంద‌నే అనుమానం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాధిత యువ‌తిని చాలార‌కాలుగా వేధింపులకు గురి చేశాడు. అత‌ని పైశాచిక‌త్వం ప‌రాకాష్ట‌కు చేరింది. కనిగిరి శివార్లకు ర‌మ్మ‌ని బాధిత యువ‌తికి ఫోన్ చేశాడు. ఒక్క‌డినే ఉన్నాన‌ని, త‌న‌ను క‌లుసుకోవాల‌ని చెప్పాడు. అత‌ని ఉద్దేశం తెలియ‌ని బాధిత యువ‌తికి అత‌ను చెప్పిన ప్ర‌దేశానికి వెళ్లింది.

అప్ప‌టికే కార్తీక్‌.. త‌న స్నేహితులు సాయి, కోటేశ్వ‌ర‌రావు, ప‌వ‌న్‌ల‌తో అక్క‌డ కాపుగాశాడు. ఆ యువ‌తికి చేరుకోగానే అస‌భ్యంగా మాట్లాడాడు. దీనితో ఆమె వెళ్లిపోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. ప‌ట్టుకున్నారు. అమ్మాయిపైకి సాయి అనే స్నేహితుడు అత్యాచారం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. సాయి కీచక చర్యకు పాల్పడుతుండగా.. కార్తీక్‌, అతని స్నేహితులు తమ సెల్‌ఫోన్‌లో ఆ ఘాతుకాన్ని చిత్రీక‌రించారు.

ఆమె ఎంత వేడుకున్నా కిరాతకంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో బాధితురాలు నరకం అనుభవించింది. అక్క‌డితో ఆగలేదు. దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. షేర్ చేశారు. అవి బాధిత యువ‌తి కుటుంబసభ్యుల దృష్టికి వ‌చ్చింది. ఆ దృశ్యాల‌ను చూసిన నిర్ఘాంత‌పోయిన బాధిత యువ‌తి కుటుంబ స‌భ్యుల‌ను క‌నిగిరి పోలీసులను ఆశ్రయించారు.

ఈ అమానుషానికి పాల్ప‌డిన‌ కార్తీక్‌, సాయి, కోటేశ్వ‌ర‌రావు, ప‌వ‌న్‌ల‌పై అత్యాచారయత్నంతోపాటు వివిధ సెక్షన్‌ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురూ ప‌రారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

About the author

Related

JOIN THE DISCUSSION