అమితాబ్ బచ్చన్ 75వ పుట్టినరోజు.. ఆయన జీవితంలో చేసిన కొన్ని తప్పులు..!

అమితాబ్ బచ్చన్.. భారతదేశం గర్వించదగిన నటుల్లో ఆయన కూడా ఒకరు. మెగాస్టార్ గా, ఆల్ టైమ్ గ్రేట్ హీరోగా ప్రశంసలు అందుకున్నారు. నేడు ఆయన తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దాదాపు 180కి పైగా సినిమాల్లో నటించాడు ఆయన. బాలీవుడ్ లో 47సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఆయనది. ఆయన సినిమా అంటే అభిమానులు పడి చచ్చేవారు. ఆయనను తమ బ్యానర్ లో నటింపజేయడానికి ప్రముఖ సంస్థలు ఎగబడ్డేవి.. అలాంటిది ఆయన ఒకానొక సమయంలో దివాలా తీశాడు. పరమ చెత్త సినిమాల్లో నటించాడు.. వాటిలో కొన్ని మీ ముందుకు

రాజకీయాలు:
రాజకీయాల్లోకి బిగ్ బీ రావడం అప్పట్లో సంచలనం. దక్షిణాదిలో అప్పటికే ప్రముఖ హీరోలు రాజకీయాల్లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయ్యారు. అదే ఊపులో 1984లో అమితాబ్ బచ్చన్ అలహాబాద్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించాడు. అయితే మూడంటే మూడు సంవత్సరాలు కూడా పదవిలో ఉండకుండా రాజీనామా చేశాడు. తాను ఏదో చేద్దామని రాజకీయాల లోకి వచ్చానని కానీ అలాంటివన్నీ ఇక్కడ చేయడం కుదరదని చెప్పుకొచ్చాడు. రియాలిటీ వేరు రాజకీయం వేరని చెప్పి ఇకపై రాజకీయాల్లోకి తాను రానని చెప్పాడు.

నిశబ్ద్:

ఈ సినిమాలో బిగ్ బీ ఎందుకు నటించాడా అని అభిమానులే బాధపడుతుంటారు. ఏజ్ బార్ అయిన వ్యక్తి టీనేజ్ అమ్మాయిని ప్రేమించడం. గతంలో ఎప్పుడూ లేనంత నెగటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకు వచ్చింది. గొప్ప సినిమాలు తీయాల్సిన సమయంలో ఈ చెత్త సినిమాలు ఏంటి అని అమితాబ్ బచ్చన్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు అభిమానులు. ఇందులో మన ఆర్జీవీ హస్తం కూడా ఉంది లేండి..!

బూమ్:

అమితాబ్ కెరీర్ లో అతి చెత్త చిత్రాల లిస్టులో ఇది కూడా చేరుతుంది. ఇంత దారుణమైన కథను అమితాబ్ ఎందుకు ఎంచుకున్నాడా అని ప్రతి ఒక్కరికీ అనిపించేంతలా ఈ సినిమా నసపెడుతుంది. ఏ మాత్రం అమితాబ్ నటించాల్సిన సినిమా కాదు. చివరికి ఓ బి-గ్రేడ్ సినిమాలో అమితాబ్ నటించాడని అప్పట్లో చెప్పుకున్నారు.

అజూబా:

అజూబాపై విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఉండేవి. కానీ మార్నింగ్ షో మొదలవ్వడం విపరీతమైన నెగెటివ్ పబ్లిసిటీ మొదలైంది. చిత్రం ఏ మాత్రం కూడా అమితాబ్ అభిమానులకు రుచించలేదు. శశి కపూర్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇంత చెత్త సినిమా తీసినందుకు ఆయన్ను కూడా బాగా విమర్శించారు.

ఏబీసీఎల్:

ఈ సంస్థను స్థాపించిన తర్వాత అమితాబ్ దివాలా తీశాడు. ఈ బ్యానర్ మీద తీసిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో అప్పటివరకూ సంపాదించిన డబ్బును అమితాబ్ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ భారత్ లో మొదలవ్వడంతో తిరిగి డబ్బును సంపాదించుకోగలిగాడు.

About the author

Related

JOIN THE DISCUSSION