హైద‌రాబాద్‌లో `బిచ్చ‌గాడు`

బిచ్చ‌గాడు సినిమా చూశారు క‌దా! క‌న్న‌త‌ల్లి ఆరోగ్యం బాగుప‌డాల‌ని ఓ న‌గ‌రానికి వెళ్లి 40 రోజుల పాటు త‌నెవ‌రో, త‌న ఉనికి ఏమిటో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా బిచ్చ‌మెత్తుకుని జీవిస్తాడో బిలియ‌నీర్‌. అలాంటి క‌థే నిజ జీవితంలో చోటు చేసుకుంది. కాక‌పోతే- చిన్న తేడా. ఆ సినిమాలో హీరోలాగా బిచ్చ‌మెత్తుకోలేదు గానీ.. అతి త‌క్కువ జీతానికి నాలుగు చోట్ల ప‌నిచేశాడో బిలియ‌నీర్ కుమారుడు.

ఆ బిలియ‌నీర్ గుజ‌రాత్‌కు చెందిన ప్ర‌ముఖ వ‌జ్రాల వ్యాపారి హ‌రేకృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ చీఫ్ సావ్‌జీ భాయ్ ఢోలాకియా సోద‌రుడు ఘ‌న్‌శ్యామ్ ఢొలాకియా. ఆ బిలియ‌నీర్ కుమారుడు హితార్థ్ ఢోలాకియా. ఈ సావ్‌జీ భాయ్ ఢోలాకియా అంటే ఆయ‌న సంస్థ ఉద్యోగులు ప్రాణ‌మిస్తారు.

ఎందుకంటే- ఏటా దీపావ‌ళి పండుగ నాడు త‌న సంస్థ‌లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఫ్లాట్లు, కార్ల‌ను ఆయ‌న బ‌హుమానంగా ఇస్తుంటారు. ఉద్యోగుల క‌ష్టాలు, వారి క‌న్నీళ్ల‌ను తెలుసుకోవ‌డానికి సావ్‌జీ భాయ్ కుమారుడు హితార్థ్ హైద‌రాబాద్‌లో అచ్చంగా అజ్ఞాత‌వాసం చేశాడు. వ్యాపార బాధ్యతలు స్వీకరించడానికి ముందు కొంతకాలంపాటు సామాన్యుడిలా జీవితం గడపాల‌ని నిర్ణ‌యించారు.

తాము ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచి.. క‌నీసం సెల్‌ఫోన్ కూడా లేకుండా నెల రోజుల పాటు ఎక్క‌డైనా, ఏ రాష్ట్రంలోనైనా ప‌నిచేయాలి. అప్పుడే కిందిస్థాయి ఉద్యోగుల ఇబ్బందులు, సమస్యలు ఎలా ఉంటాయో తెలుసుకోవ‌డం కోస‌మే అజ్ఞాత‌వాసం. దీనితో హితార్థ్‌ హైదరాబాద్‌లో నెలరోజులపాటు ఉన్నారు.

వారానికి ఒకటి చొప్పున నాలుగు ఉద్యోగాలు చేశాడ‌త‌ను. శుక్రవారం హైద‌రాబాద్‌లో త‌న పెద‌నాన్న సావ్‌జీ ఢోలాకియా, పెద్దమ్మ గౌరీ బెన్‌, సోదరుడు పింటూ తులసీ భట్‌, సోదరి కృపాలి, ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ త్రివేదితో కలిసి మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్‌ ఎక్కడుంటుందో కూడా తనకు తెలియదని..అలాంటి న‌గ‌రాన్ని తాను ఎంచుకున్నాన‌ని అన్నారు. తానేమిటో తెలియ‌కుండా నాలుగు చోట్ల ప‌ని చేశాన‌ని అన్నాడు. ఉద్యోగి కష్టాలు ఉద్యోగిగా ఉంటేనే తెలుస్తాయని అన్నారు. గుర్తింపు కార్డులు, మొబైల్‌ఫోన్‌, ఏటీఎం, క్రెడిట్‌కార్డులు లేకుండా 500 రూపాయలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టాన‌ని చెప్పాడు.

మెక్‌డోనాల్డ్స్‌ ఫుడ్‌కోర్ట్, ఆడిదాస్‌ షోరూం, చిల్లీస్‌ రెస్టారెంట్‌ సహా సికింద్రాబాద్‌లోని కార్డుబోర్డ్‌ షాపుల్లో దినసరి కార్మికునిగా నెలరోజుల పాటు ప‌నిచేశాన‌ని అన్నాడు. త‌న‌కు జీవిత పాఠాన్ని నేర్పించిన హైద‌రాబాద్‌కు ఎంతో కొంత మేలు చేస్తాన‌ని అన్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION