న‌ష్టాలొచ్చాయని.. త‌ల్లి, భార్య‌, ఇద్ద‌రు చిన్నారుల గొంతు కోశాడు..దీనిఫ‌లితం?

వ‌స్త్ర వ్యాపారంలో వ‌చ్చిన న‌ష్టం.. అత‌ణ్ణి రాక్ష‌సుడిగా మార్చాయి. న‌ష్టాన్ని అధిగ‌మించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు వృధా అయ్యాయ‌నే ఆగ్ర‌హం అత‌ణ్ణి మృగంగా త‌యారు చేశాయి. చేసిన అప్పులు విచ‌క్ష‌ణ కోల్పోయేలా చేశాయి.

అయిదు, ఏడేళ్ల వ‌య‌స్సున్న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో స‌హా క‌ట్టుకున్న భార్య‌ను, క‌న్న‌త‌ల్లిని అతి దారుణంగా హ‌త‌మార్చాడు. ఎంత దారుణంగా అంటే.. క‌త్తితో వారంద‌రి గొంతు కోశాడు. చివ‌రికి.. తానూ ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడు. తీవ్ర గాయాల‌పాలై, ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నైలోని పల్లవరం సమీపంలో ఉన్న‌ పంబల్‌కు చెందిన దామోదరన్ వస్త్ర వ్యాపారి. ఇంటికి ద‌గ్గ‌ర్లోనే ఓ బ‌ట్ట‌ల దుకాణాన్ని నిర్వ‌హిస్తున్నాడు. అత‌నికి తల్లి సరస్వతి, భార్య దీప కుమారుడు రోషన్‌, కుమార్తె మీనాక్షి ఉన్నారు.

పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. కొంత‌కాలంగా దామోదరన్ న‌ష్టాల‌కు గుర‌వుతున్నాడు. వ్యాపారం స‌రిగ్గా సాగ‌క‌పోవ‌డంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవ‌డానికంటూ అప్పులు తీసుకున్నాడు.

అయిన‌ప్ప‌టికీ.. అంతంత మాత్రంగానే వ్యాపారం సాగుతుండేది. కొంత‌కాలంగా రుణ‌దాత‌ల నుంచి ఒత్తిళ్లు తీవ్ర‌మ‌య్యాయి. వ్యాపారం సరిగా సాగ‌ట్లేదని, అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధిక‌మ‌య్యాయ‌ని అంద‌రితోనూ చెబుతుండేవాడు.

దామోద‌ర‌న్ మొద‌ట తాను ఒక్క‌డినే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. తాను చనిపోతే అప్పుల వారు త‌న కుటుంబాన్ని వేధిస్తారని, అందుకే కుటుంబం మొత్తాన్నీ చంపాల‌ని భావించాడు. మంగళవారం తెల్లవారుజామున మొద‌ట బావమరిది రాజాకు ఫోన్ చేశాడు.

తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు చెప్పాడు. కూర‌గాయ‌లు త‌రిగే కత్తితో మొద‌ట‌ భార్యను, ఆ తరువాత తల్లి గొంతు కోశాడు. వారు చ‌నిపోయార‌ని నిర్ధారించుకున్న త‌రువాత కుమారుడు, కుమార్తె గొంతుకోశాడు. అదే క‌త్తితో తానూ గొంతు కోసుకున్నాడు.

ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న స‌మాచారం తెలుసుకున్న దామోదరన్‌ బావమరిది ప‌రుగు ప‌రుగున వ‌చ్చేస‌రికే ఘోరం జ‌రిగిపోయింది. అత‌ను వ‌చ్చేస‌రికి ఇల్లంతా ర‌క్త‌పు మ‌డుగులో క‌నిపించింది. దామోదరన్, ఇద్దరు పిల్లలు కొస ప్రాణాల‌తో ఉండ‌టంతో వారిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

మార్గ‌మ‌ధ్య‌లో పిల్ల‌లు మ‌ర‌ణించారు. దామోదరన్‌ చెన్నై జీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రాసిన 5 పేజీల సూసైడ్‌ నోటు పోలీసుల చేతికి చిక్కింది.

About the author

Related

JOIN THE DISCUSSION