హైద‌రాబాద్‌: తాగుడు కోసం తొమ్మిది నెల‌ల ప‌సిగుడ్డును అమ్మేశాడు..

మ‌ద్యానికి బానిసైన ఓ వ్య‌క్తి డ‌బ్బుల కోసం త‌న కుమార్తెను విక్ర‌యించాడు. ఆ త‌రువాత కిడ్నాప్ నాట‌కం ఆడాడు. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది మ‌న హైద‌రాబాద్‌లోనే. పాతబస్తీ డబీర్‌పురాలో నివ‌సించే మ‌స్తాన్ ఆటో డ్రైవర్‌. ఈ నెల 4వ తేదీన త‌న తొమ్మిది నెల‌ల కుమార్తె కిడ్నాప్‌న‌కు గురైన‌ట్టు పోలీస్ స్టేస‌న్‌లో ఫిర్యాదు చేశాడు.

బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పీవీ ఎక్స్‌ప్రెస్‌ 70వ నంబరు పిల్ల‌ర్‌ వద్ద తన తొమ్మిది నెలల కుమార్తె నూరీన్‌ బేగంను కిడ్నాప్‌ చేశారని లిఖిత‌పూర‌కంగా ఫిర్యాదు ఇచ్చాడు. అదే బైక్‌పై తనను కూడా లింగంపల్లికి తీసుకెళ్లార‌ని, అక్క‌డ వ‌దిలిపెట్టి పారిపోయారని వివరించాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు.

మ‌స్తాన్ మ‌ద్యానికి అల‌వాటు ప‌డ్డాడ‌ని తెలుసుకున్నారు. కిడ్నాప్ జ‌రిగిన‌ట్టు మ‌స్తాన్ చెప్పిన రోజే అత‌ను, అత‌ని భార్య రిజ్వానా, తొమ్మిదినెల‌ల కుమార్తెతో క‌లిసి అత్తాపూర్‌లోని కల్లు కంపౌండ్‌కు వచ్చారని తేలింది. ఇద్దరు కలిసి కల్లు తాగారు. అక్క‌డి నుంచి మెహ‌దీప‌ట్నం రింగ్‌రోడ్‌లో ఉన్న బంగారు మైస‌మ్మ గుడి వ‌ద్ద నిద్ర‌పోయారు.

రిజ్వానా మత్తులోకి జారుకుంది. దీనితో మస్తాన్ త‌న కుమార్తెను అమ్మ‌కానికి పెట్టాడు. శేరిలింగంపల్లి, గుల్మార్‌ పార్కు ప్రాంతానికి చెందిన మేస్త్రీ బాల్‌రాజ్‌, బాలమణి దంపతులకు సంతానం లేకపోవడంతో 46 వేల రూపాయ‌ల‌కు ఆ చిన్నారిని కొనుగోలు చేశారు. మత్తు దిగిన తర్వాత కుమార్తె కనిపించకపోవడంతో భర్తను రిజ్వాన్‌ నిలదీసింది.

తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారని ఇద్దరూ లంగర్‌హౌస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. భార్య మత్తులో ఉండగా మస్తాన్‌ కుమార్తెను అమ్మినట్టు తేలింది. బాలమణి, బాల్‌రాజ్‌ నుంచి చిన్నారిని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. మస్తాన్‌పై కేసు నమోదు చేసి.. బాలమణి, బాల్‌రాజ్‌ను రిమాండ్‌కు తరలించారు. మస్తాన్‌ నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION