`గాయ‌త్రి` హార‌ర్ సినిమా థియేట‌ర్‌లో అస‌లు జ‌రిగిందేమిటి?

`గాయ‌త్రి` అని క‌న్న‌డ‌నాట శుక్ర‌వారం ఓ హార‌ర్ సినిమా విడుద‌లైంది. ఏ సినిమా విడుద‌లైనా వెంట‌నే థియేట‌ర్ల‌పైకి వాలిపోయే సినీ పక్షులు పెద్ద సంఖ్య‌లోనే మార్నింగ్‌షోకు వెళ్లారు. బాగానే ఉంది. మెజ‌స్టిక్ బస్‌స్టేష‌న్ ద‌గ్గ‌ర‌లో ఉన్న మేన‌క చిత్రమందిర్ థియేట‌ర్‌కు కూడా ప్రేక్ష‌కులు వెళ్లారు.

సినిమా చూస్తున్నారు. ఇంత‌లో ఓ యువ‌కుడు హ‌ఠాత్తుగా బాల్క‌నీ నుంచి కింద ప‌డ్డాడు. పెద్ద‌గా గాయాలు కాన‌ప్ప‌టికీ.. షాక్‌కు గుర‌య్యాడు. స్పృహ త‌ప్పాడు. వెంట‌నే అత‌ణ్ణి స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ విష‌యం సినిమా నిర్మాత‌ల‌కు తెలిసింది.

ఇక్క‌డే ఉందో అస‌లు ట్విస్ట్‌. హార‌ర్ సినిమా క‌దా! అందులో ఉండే భ‌యాన‌క స‌న్నివేశాల‌ను చూడ‌లేక గుండెపోటుకు గుర‌య్యాడ‌ని, ఆ రేంజ్‌లో త‌మ సినిమా ఉంద‌నే ప్ర‌చారం మొద‌లు పెట్టింది చిత్రం యూనిట్‌.

చాలామంది ప్రేక్ష‌కులు సినిమా చూడ‌లేక అర‌చేతుల్లో ముఖాన్ని దాచుకున్నారంటూ ప్ర‌చారం చేసింది. సినిమాకు మౌత్ ప‌బ్లిసిటీని తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఆ సినిమా నిర్మాత‌ల పాలిట మేన‌క చిత్ర‌మందిర్ థియేట‌ర్ య‌జ‌మాని పెద్ద విల‌న్‌గా మారాడు.

అదంతా ఉత్తిదేనంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సినిమా మొద‌లు కావ‌డానికి ముందే- ఆ యువ‌కుడు బాల్క‌నీ మీది నుంచి ప‌డిపోయాడ‌ని, దీనికి కార‌ణం మూర్ఛ..ఫిట్స్ రావ‌డ‌మే కార‌ణ‌మ‌ని పోలీసుల‌కు చెప్పాడు.

సినిమా మొద‌లు కాక‌ముందే- ఫిట్స్ వ‌ల్ల ఆ యువ‌కుడు బాల్కనీ నుంచి కింద‌ప‌డ్డాడ‌ని పోలీసుల‌కు లిఖిత‌పూర‌కంగా రాసిచ్చాడు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పోలీసుల‌కు ఇచ్చాడు. దీనితో సినిమా నిర్మాత‌లు అబ‌ద్ధ ప్ర‌చారానికి తెర తీసిన‌ట్ట‌యింద‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు.

About the author

Related

JOIN THE DISCUSSION