ఇంట్లోకి రానివ్వ‌ని ఓన‌ర్‌..రాత్రంతా వ‌ర్షంలోనే చిన్నారి మృత‌దేహం

మానవత్వం మరోసారి మంటగలిసింది. కాసులే త‌ప్ప క‌నిక‌రం లేద‌నే విష‌యం మ‌ళ్లీ నిరూపితమైంది. క‌న్న‌బిడ్డ మృత‌దేహాన్ని ఇంటిలోపలికి తీసుకుని రావ‌డానికి ఇంటి య‌జ‌మాని ఒప్పుకోక‌పోవ‌డంతో.. రాత్రాంతా భారీ వ‌ర్షంలోనే ఉంచారు. వ‌ర్షం ప‌డ‌కుండా ఉండ‌టానికి దుప్ప‌ట్లు చేత‌ప‌ట్టుకుని అడ్డుగా నిలిచారు.

ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలో చోటు చేసుకుంది. కూక‌ట్‌ప‌ల్లి వెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న సురేష్ అనే ఆరో తరగతి విద్యార్థి డెంగ్యూతో బాధ‌ప‌డుతున్నాడు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం రాత్రి మ‌ర‌ణించాడు. సురేష్ మృత‌దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు త‌ల్లిదండ్రులు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉంచారు.

ఆ స‌మ‌యంలో భారీగా వ‌ర్షం రావ‌డంతో మృత‌దేహాన్ని ఇంట్లోకి తీసుకుని రావడానికి ప్ర‌య‌త్నించ‌గా.. ఇంటి ఓన‌ర్ అడ్డుప‌డ్డాడు. మృత‌దేహాన్ని ఇంట్లోకి తేవ‌ద్దంటూ బీష్మించాడు. చేసేది లేక వర్షంలోనే బిడ్డ మృత‌దేహంతో గడిపారు కుటుంబ సభ్యులు. ఇంటి ముందు ఉన్న అరుగుపైనే చిన్నారి మృత‌దేహాన్ని ఉంచి.. తడవకుండా ఉండ‌టానికి టార్పాలిన్లు క‌ప్పారు.

దుప్పట్లను అడ్డు పెట్టి నిల్చున్నారు. ఓ వైపు భారీ వర్షం.. మ‌రోవైపు బిడ్డ మృత‌దేహంతో ఆరుబ‌య‌టే గ‌డిపారు. వారిని ఆదుకోవ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. ఉదయం ఈ విషయం తెలుసుకున్న కాలనీ వాసులు..అప్పటికప్పుడు గ్లాస్ బాక్స్ తీసుకొచ్చి చిన్నారి మృతదేహాన్ని అందులో ఉంచారు. కాలనీవాసులు కొందరు ఆర్థికసాయం చేశారు. అంత్యక్రియలకు సహకారం అందించారు.

About the author

Related

JOIN THE DISCUSSION