లేచిన 5 నిమిషాల‌కే మొబైల్….

లేచిన 5 నిమిషాల‌కే మొబైల్….

మీరు మొబైల్ వాడుతున్నారా. నిద్ర లేచిన త‌ర‌వాత ఎంత‌సేప‌టికి మీరు మీ మొబైల్‌ను చూస్తారు. ఫోన్లేమైనా వ‌చ్చాయా..ఎస్ఎమ్ఎస్‌లు వ‌చ్చాయా అని చూసుకుంటారా. ఏమిటి లేచిన త‌ర‌వాత గంట‌కి చూస్తున్నామంటారా. నిజ‌మే కావ‌చ్చు. కానీ ఈ అంశంపై చేసిన ఓ స‌ర్వే మొబైల్ వాడుతున్న‌వారిలో 61శాతం మంది నిద్ర‌నుంచి క‌ళ్ళు తెరిచిన 5 నిముషాల‌కే త‌మ చ‌ర‌వాణిని స్పృశిస్తార‌ట‌. ఇప్పుడు చెప్పండి ఈ జాబితాలో మీరున్నారా..2016లో డెలాయిట్ సంస్థ చేప‌ట్టిన గ్లోబ‌ల్ మొబైల్ క‌న్స్యూమ‌ర్ స‌ర్వే దీన్ని వెల్ల‌డించింది. బుధ‌వారం ఈ వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేశారు. లేచిన అర్ధ‌గంట‌లోపు సెల్‌ఫోన్ల‌ను చూసుకునే వారి సంఖ్య 88శాతం దాకా ఉంద‌ట‌. ప్ర‌తిరోజు ఉద‌యం లేచిన త‌ర‌వాత  గంట‌కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలో 96శాతం మంది మొబైల్‌ను తాక‌కుండా ఉండ‌లేర‌ట‌. నిద్ర‌పోవ‌డానికి 15నిముషాల ముందు కూడా 74శాతం మంది త‌మ మొబైళ్ళ‌లో స‌మాచారాన్ని క‌న్నులారా చూసుకుని గానీ క‌ళ్ళు మూయ‌ర‌ట‌. స్మార్ట్ ఫోన్ల వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింద‌ని ఈ స‌ర్వే తేల్చింది.

 

దైనిక కార్య‌క‌లాపాల‌ను ఇది చాలా ఆటంక‌పరుస్తోంద‌నీ తేలింది. వినియోగ‌దారుల వ్య‌క్తిగ‌త జీవితాల‌ను మొబైల్ ఎంత ఎంత ప్ర‌భావితం చేస్తోందో త‌మ స‌ర్వే తెలియ‌జేసింద‌ని డెలాయిట్ ట‌చ్ తోమ‌త్సు ఇండియా భాగ‌స్వామి అయిన నీర‌జ్ జైన్ చెబుతున్నారు. మొత్తం 53వేల మందిని స‌ర్వేలో ప‌ల‌క‌రించారు. వీరిలో రెండువేల మంది భార‌త‌దేశానికి చెందిన వారున్నార‌ట‌. సోష‌ల్ మీడియా, ఇన్‌స్టంట్ మేసేజింగ్ యాప్‌ల‌ను వినియోగ‌దారులు మొట్ట‌మొద‌ట చూసుకుంటార‌ని స‌ర్వే పేర్కొంది. వ్య‌క్తిగ‌త ఈ మెయిల్స్‌, టెక్స్ట్ మెసేజీలు చూసేవారు దీని త‌ర‌వాత స్థానంలో ఉన్నార‌ట‌. ఇండియాలో 54 శాతం మంది త‌మ బ్యాంకు బ్యాలెన్స్ త‌నిఖీ చేసుకోవ‌డానికీ, 54శాతం మంది బిల్లుల చెల్లించ‌డానికీ, 53శాతం మంది సేవా ప‌న్నుల‌ను చెల్లించ‌డానికీ, 38శాతం మంది దేశంలోని వివిధ ఖాతాల‌కు న‌గ‌దు బ‌దిలీకీ, 31శాతం విదేశాల‌కు న‌గ‌దు బ‌దిలీకీ మొబైల్‌ను ఉప‌యోగిస్తామ‌ని వెల్ల‌డించారని పిటిఐ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *