శ‌వాల‌తో సెల్ఫీ

శ‌వాల‌న్నీ సమాధుల నుంచి లేచొస్తాయి. నేరుగా ఇంటికెళ్తాయి. త‌మ వారిని ప‌ల‌క‌రిస్తాయి. వారితో సెల్ఫీ దిగుతాయి. విన‌డానికి ఇది వింత‌గానే ఉన్నప్ప‌టికీ.. మ‌న క‌ళ్ల‌ముందు కొన‌సాగుతున్న వాస్త‌వం ఇది. ఇండోనేషియాలోని సుల‌వేసి ద‌క్షిణ ప్రాంతంలోని ఓ గిరిజ‌న గ్రామంలో ప్ర‌తి మూడేళ్ల‌కోసారి చోటు చేసుకునే ఉత్స‌వం ఇది.

ఏటేటా మ‌నం పెద్ద‌ల మ‌హాల‌య అమావాస్య, పితృప‌క్ష రోజుల‌ను నిర్వ‌హిస్తుంటామే అలాగ‌న్న మాట‌. ఆ ఊరిలో నివ‌సించే వారందరూ గిరిజ‌నులే. టానా టోరెజ అనే గిరిజ‌న తెగ ప్ర‌జ‌లు వాళ్లు. శ‌తాబ్దాల నుంచీ వారు ఈ ఆన‌వాయితీని పాటిస్తూ వ‌స్తున్నారు. మూడేళ్ల‌కోసారి శ్మ‌శానానికి వెళ్తారు. త‌మ ఆత్మీయుల స‌మాధుల‌ను త‌వ్వుతారు.

శ‌వ‌పేటిక‌లో ఉంచిన మృత‌దేహాన్ని వెలికి తీస్తారు. చ‌క్క‌గా శుభ్రం చేస్తారు. కొత్త బ‌ట్ట‌ల‌ను తొడిగిస్తారు. మృతుల‌కు ఇష్ట‌మైన ఆహారాన్ని ఆ శ‌వాల ముందుంచుతారు. త‌మవారు జీవించి వ‌చ్చిన‌ట్టే భావిస్తారు. శ‌వాల‌తో సెల్ఫీలూ దిగుతారు. ఇదేదో మూఢ‌విశ్వాసం కాదు. ఆచారం. ఆ ఉత్స‌వాన్ని నిర్వ‌హించ‌క‌పోతే- త‌మ ఆత్మీయుల‌ను అగౌర‌వ ప‌రిచిన‌ట్టుగా భావిస్తారు అక్క‌డి ప్ర‌జ‌లు.

ఆత్మ క్షోభిస్తుంద‌నీ విశ్వ‌సిస్తారు. అందుకే ప్ర‌తి మూడేళ్ల‌కోసారి క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ ఉత్స‌వాన్ని నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఈ ఉత్స‌వానికి క‌నీసం 500 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న‌ట్టు చెబుతున్నారు. చిన్న‌పిల్ల‌ల మొదలుకుని వృద్ధుల వ‌ర‌కూ ఏ ఒక్క‌రి మృత‌దేహాన్నీ వ‌ద‌ల‌రు. ఇలా చేయ‌డం వ‌ల్ల గ‌తించిన వారి ఆత్మ ఆనందిస్తుంద‌నే ప్ర‌గాఢ విశ్వాసం వారిది.

About the author

Related

JOIN THE DISCUSSION