గ‌ణేష్ నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో యువ‌తి డాన్స్‌..ఆమెపై దారుణ కామెంట్‌: దాని ఫ‌లితం?

గ‌ణేషుడి విగ్ర‌హాల నిమ‌జ్జ‌న వేడుక‌ల్లో డాన్స్ చేయ‌డం అల‌వాటు. బీట్‌కు అనుగుణంగా యువ‌త డాన్స్ చేస్తూ సంద‌డి చేస్తుంటుంది. అలా డాన్స్ చేస్తోన్న ఓ యువ‌తిని ప‌ట్టుకుని దారుణంగా కామెంట్ చేశాడో యువ‌కుడు. ఆ కామెంట్స్ ఆ యువ‌తి ప్రేమికుడి చెవుల్లో ప‌డ్డాయి. మొద‌టి సారి కదా! అని అత‌ణ్ణి వారించాడు ప్రేమికుడు.

అయినా విన్లేదు. ప్రేయ‌సీ, ప్రియుల‌ను ఇద్ద‌ర్నీ ప‌ట్టుకుని తిట్టాడు. దాన్ని మ‌న‌సులో పెట్టుకున్న ఆ ప్రేమికుడు.. అద‌ను చూసి దెబ్బ‌కొట్టాడు. ఆ యువ‌కుడిని హ‌త‌మార్చాడు. 2016లో వ‌రంగ‌ల్ జిల్లాలోని భట్టుపల్లి శివారులో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది.

భ‌ట్టుపల్లి శివార్ల‌లోని నిర్జ‌న ప్ర‌దేశంలో ల‌భించిన‌ యువకుడు మృత‌దేహం వెనుక ఉన్న మిస్ట‌రీని ఛేదించారు పోలీసులు. దీనికోసం వారు ఏకంగా 13 నెల‌ల పాటు నిరంత‌రాయంగా ద‌ర్యాప్తు కొన‌సాగించారు. ఇక్క‌డ మ‌రోసారి పోలీసుల గొప్ప‌త‌నం బ‌య‌ట ప‌డింది.

ఈ కేసు పూర్వాప‌రాల‌ను ఖాజీపేట ఏసీపీ జనార్దన్ వెల్ల‌డించారు. దర్గా ఖాజీపేటకు చెందిన గుగులోత్ శివ వర్ధన్నపేటకు చెందిన రెడ్డిమల్ల రామ్‌కీ స్నేహితులు. 2016 సెప్టెంబర్ 14వ తేదీన రాత్రి 8 గంటలకు గణేశ్ నిమజ్జనోత్స వాల్లో వారు పాల్గొన్నారు.

అందులో భాగంగా రామ్‌కీకి పరిచయమున్న ఓ యువతి డ్యాన్స్ చేస్తుండగా దర్గా ఖాజీపేటకు చెందిన పులిగిళ్ల చందు అలియాస్ చింటు అసభ్యకరంగా కామెంట్ చేశాడు. దీంతో రామ్‌కీ అత‌ణ్ణి మంద‌లించాడు. అయినప్ప‌టికీ చందూ వినిపించుకోలేదు. రామ్‌కీని కూడా దూషించాడు. దీనితో చందూను చంపాలని నిర్ణయించుకున్నాడు రామ్‌కీ.

దీనికోసం శివ సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం చందూను ఓ కారులో ఎక్కించుకుని బలవంతంగా మద్యం తాగించారు. వర్ధన్నపేటలోని త‌న ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మళ్లీ మద్యం తాగించి భట్టుపల్లిరోడ్డు వైపు తీసుకెళ్లారు.

వెంట తీసుకెళ్లి న ఓ ఇనుపచువ్వతో చందూ గొంతుపై పొడిచిచంపాడు. మృతదేహాన్ని భట్టుపల్లి శివారులోని కోటచెరువు మత్తడి వద్దనున్న చెట్ల పొదల్లో పడేశారు. అక్కడి నుంచి వర్ధన్నపేట మండలం కొత్తపల్లి చెరువు వద్దకు వెళ్లి కారుకు, ఇనుపచువ్వకు అంటిన రక్తపు మరకలను కడిగేసి బకెట్, జగ్గును అక్కడే పొదల్లో పడేశారు.

తెల్లవారుజామున స్థానికులు చందూ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలను సేకరించారు. అనంతరం మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు.

రంగంలో దిగిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను పిలిచి విచారించారు. కేసును ఛేదించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కారు, ఇనుపచువ్వ, ప్లాస్టిక్ బకెట్, జగ్గును స్వాధీనం చేసుకున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION