ఆ ప్రొఫెస‌ర్ ఒంటిపై 15 క‌త్తిపోట్లు..!

త‌మిళ‌నాడులోని మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయంలో జ‌ర్న‌లిజం విభాగం గెస్ట్ లెక్చ‌ర‌ర్ ప్రొఫెస‌ర్ జెన్నీఫాపై మ‌రో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ దాడి చేశాడు. క‌త్తితో 15 సార్లు పొడిచాడు. విశ్వ‌విద్యాల‌యంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. క‌త్తిపోట్ల‌కు గురై, ప్రాణాపాయ స్థితిలో ఉన్న జెన్నీఫాను హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం ఆమె అక్క‌డ చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. మ‌ధురై కామ‌రాజ్ విశ్వవిద్యాల‌యంలో జ‌ర్న‌లిజం విభాగంలో ఆమె గెస్ట్ లెక్చ‌ర‌ర్‌. గ‌తంలో ఇదే విభాగంలో జ్యోతి మురుగన్ అనే వ్య‌క్తి పార్ట్ టైమ్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశాడు.

ప్ర‌వ‌ర్త‌న బాగుండ‌క‌పోవ‌డం, క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యం వంటి చ‌ర్య‌ల వ‌ల్ల జెన్నీఫా అత‌ణ్ణి విధుల నుంచి తొల‌గించారు. దీనితో జెనిఫాపై అతను కోపం పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం జెనిఫా విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో ఉండగా జ్యోతి మురుగన్‌ వచ్చాడు. తనను మళ్లీ విధుల్లో చేర్చుకోవాలని ప‌ట్టుబ‌ట్టాడు.

దీనికి ఆమె నిరాక‌రించారు. ఆవేశంతో ఊగిపోయిన మురుగన్ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. 15సార్లు పొడిచాడు. ఆమె కేకలను విన్న తోటి ప్రొఫెసర్లు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రాథ‌మిక చికిత్స కోసం పుదుకోటై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రస్తుతం మధురైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

నాగమలై పుదుకోట పోలీసులు మురుగన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లుగా చెప్పి పెళ్లి చేసుకున్నాన‌ని, తీరా పెళ్ల‌యిన త‌రువాత ఉద్యోగం పోవ‌డంతో భార్య త‌ర‌ఫు బంధువులు ఒత్తిడి తెస్తున్నార‌ని జ్యోతి మురుగన్ చెప్పాడు. అందుకే, మళ్లీ ఉద్యోగం ఇవ్వమని జెనిఫాను కోరగా.. ఆమె తిరస్కరించిందని చెప్పాడు. ఆ కోపంతో దాడి చేసినట్లు మురుగన్ చెప్పాడు.

About the author

Related

JOIN THE DISCUSSION