శాంసంగ్ జే7 ఫోన్ వస్తుంది అనుకున్నాడు.. అడ్డంగా బుక్ అయిపోతానని అసలు అనుకోని ఉండడు..!

ప్రస్తుత కాలంలో రోజుకో దొంగ కంపెనీ పుట్టుకొస్తోంది. ప్రజలను ఎలా దోచుకోవాలా అని ఎదురుచూస్తూ ఉంటారు. వారిని కాస్తా నమ్మారో మీ డబ్బు అంతా గోవిందా.. గోవిందా..! ఇక ఆన్ లైన్ లో చేస్తున్న మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు 30000 రూపాయల విలువ చేసే టీవీ గెలిచారు.. దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే 3000 రూపాయలు చెల్లిస్తే చాలు అని అంటారు. అలా మీరు వాళ్ళు చెప్పిన డబ్బులు కట్టారో అంతే మీరు మోసపోయినట్లే.. ఆ డబ్బులు తీసుకొని మీకు ఎటువంటి టీవీనూ పంపరు. ఇలా ఎన్నో వెబ్ సైట్లు ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతున్నాయి.

తాజాగా ఓ వ్యక్తికి శాంసంగ్ జే7 గెలిచారని మెసేజీ వచ్చింది. అది అందాలంటే ఏకంగా 3850 రూపాయలు కట్టాలని చెప్పారు. అలా అనుకొని నమ్మిన వ్యక్తికి లక్ష్మి దేవి యంత్రాన్ని పంపారు. మధ్యప్రదేశ్ కు చెందిన సంతోష్ రాథోడ్ కు ఈ అనుభవం ఎదురైంది. 8376965390 అనే నంబర్ నుండి సంతోష్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము ఢిల్లీ నుండి మాట్లాడుతున్నాము.. మీరు ఎయిర్ టెల్ కంపెనీ తరపున ఓ కాంటెస్ట్ విన్నర్ గా నిలిచారు అని చెప్పారు. ప్రతి సంవత్సరం ఎయిర్ టెల్ కొందరిని విజేతలుగా నిర్ణయిస్తుంది ఈ ఏడాది మీరే ఆ విజేత అని చెప్పారు. అందులో మీకు శాంసంగ్ జే7 ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. మీ అడ్రస్ కు ఫోన్ వస్తుందని.. దానికి వారెంటీ కూడా ఉంటుందని నమ్మబలికారు. కంపెనీ నుండి వచ్చే పిన్ ను మీరు ఎంటర్ చేస్తే చాలు ఫోన్ స్టార్ట్ అవుతుందని భరోసా కల్పించారు.

ఫోన్ వస్తోందన్న ఆనందంలో ఉన్న సంతోష్ అది ఫేక్ కాల్ అని గుర్తించలేదు. కొద్ది రోజుల తర్వాత అతను చెప్పిన నంబర్ నుండి కాల్ వచ్చింది. మీ వస్తువు మీకు కావాలంటే 3850 రూపాయలు కట్టాలని అడిగారు. అప్పుడు కూడా ఇది ఫ్రాడ్ అని గుర్తించని సంతోష్ వాళ్ళు చెప్పిన డబ్బును పోస్ట్ ఆఫీస్ లో కట్టేసి ఆ పార్సల్ ను ఇంటికి తెచ్చుకున్నాడు. అయితే పార్సల్ ను ఓపెన్ చేయగానే సంతోష్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఏ బొమ్మ అనుకున్నారు లక్ష్మీదేవి బొమ్మ.. శాంసంగ్ ఫోన్ కు బదులుగా లక్ష్మీ దేవి యంత్రం ఆ పార్సల్ లో ఉంది. అయితే అతను ఈ విషయాన్ని కంపెనీ వాళ్లకు ఫిర్యాదు చేయగా రీఫండ్ అమౌంట్ మీ దగ్గరకు వస్తుందని చెప్పారు.. కానీ ఇప్పటివరకూ రాకపోవడంతో(రాదు కూడా) సంతోష్ మీడియాను, పోలీసులను ఆశ్రయించాడు. మోసపోయానని గుర్తించిన సంతోష్ లబోదిబోమంటున్నారు. ఇలాంటి మోసాల నుండి న్యూసు ప్రేక్షకులు కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం..!

About the author

Related

JOIN THE DISCUSSION