ప్రపంచ కప్ కోసం ఖతర్ రెడీ చేయబోతున్న స్టేడియం అదుర్స్ అంటున్నారే.. భారతీయులు కూడా పనిచేస్తున్నారు..!

గత కొద్ది రోజులుగా సంక్షోభం.. తీవ్రవాదులకు సహాయం చేస్తోందన్న అంశాలతో వార్తల్లో నిలిచినా ఖతర్ ఇప్పుడు ఓ స్టేడియం విషయంలో వార్తల్లో నిలిచింది. 2022 ఫుట్ బాల్ ప్రపంచకప్ కు ఖతర్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే..! అందుకోసం ప్రత్యేకంగా ఓ స్టేడియంను రూపొందించబోతోంది. ఆ స్టేడియం కు సంబంధించిన ఓ డిజైన్ ను నిర్వాహకులు బయటపెట్టారు. దాన్ని చూసిన వారు డిజైన్ అదుర్స్ అని అంటున్నారు. అరేబియన్ టోపీ ‘గాఫియా’ ఆకారంలో నిర్మించనున్నారు. సాధారణంగా ముస్లిం సోదరులు పెట్టుకునే టోపీలా ఇది ఉండడం విశేషం. ఇందుకు సబంధించిన డిజైన్‌ను ఖతర్‌ కు చెందిన ఆర్కిటెక్ట్ రూపొందించారు. ఈ స్టేడియంలో 40 వేల మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు.

ఉగ్రవాదాన్ని ఖతర్ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలతో సౌదీ అరేబియా, ఈజిప్ట్, బహ్రయిన్, యూఏఈలు సంబంధాలను తెంచుకున్నాయి. ఆయా దేశాల నుంచి సహకారం ఆగిపోవడంతో టర్కీ, ఇరాన్ తదితర దేశాల నుంచి ఒమన్ మీదుగా ఓడల్లో వరల్డ్ కప్ ప్రాజెక్టు కోసం నిర్మాణ సామగ్రిని కూడా తెప్పించుకుంటోంది. ఈ స్టేడియం తమను అరబ్ దేశాలు సహా అంతర్జాతీయ అరబ్స్- ముస్లిం సమాజంతో ఏకం చేస్తుందని ఖతర్ 2022 కమిటీ చీఫ్ హాసన్ అల్-తవాడీ తెలిపారు. మొత్తం ఎనిమిది స్టేడియంలను ఖతర్ 2022 వరల్డ్ కప్ కోసం ఏర్పాటు చేస్తోంది. వీటి నిర్మాణాలలో ఎందఱో భారతీయులు కూడా పాలుపంచుకుంటున్నారు. ఇది కూడా వాటిలో ఒక్కటి.. మొత్తం ఎయిర్ కండీషన్ తో రూపొందింది ఈ స్టేడియం. దాదాపు 200 బిలియన్ డాలర్ల డబ్బును ఖతర్ స్టేడియం ల నిర్మాణానికి వెచ్చిస్తోంది.

About the author

Related

JOIN THE DISCUSSION