ఇదేమి అభిమానం.. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే ఆస్ట్రేలియా జట్టు బస్సుపై రాళ్ళతో దాడి చేశారు..!

వెర్రి అభిమానానికి మరో సాక్ష్యం ఈ ఘటన.. గౌహతిలో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్ రూమ్ కు వెళుతున్న ఆస్ట్రేలియా జట్టు బస్సుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. “ఓ బలమైన రాయి వచ్చి మా బస్సు అద్దాన్ని పగులగొట్టింది. చాలా భయం వేసింది” అని ఆరోన్ ఫించ్ పగిలిన అద్దం ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు.

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఓ క్రికెట్ బాల్ సైజులో ఉన్న రాయి అద్దాన్ని తాకిందని ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ పేర్కొంది. రెండు నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎదుర్కొన్న రాళ్లదాడి ఘటనల్లో ఇది రెండోది. సెప్టెంబరులో చిట్టగ్యాంగ్ లో బంగ్లాదేశ్ తో ఓ టెస్టు మ్యాచ్ అనంతరం వెళుతున్నప్పుడూ ఇలాగే రాళ్లు విసిరారు. ఈ ఘటనపై సగటు భారత క్రికెట్ అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎవరో మూర్ఖులు ఇలా చేశారని.. వారు చేసిన తప్పుకు తామంతా చింతిస్తున్నామని అభిమానులు ఫించ్ కు రీట్వీట్ చేశారు. మీరంటే మాకు ఎంతో అభిమానమని.. ఒక్కరు చేసిన తప్పుకు భారత అభిమానులను తప్పుబట్టద్దని చెప్పారు.

అయినా ఈ టూర్ లో ఆస్ట్రేలియాకు ఇది రెండో గెలుపు మాత్రమే.. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్ ను కోల్పోయింది. మొదటి టీ20 ని కూడా చేజార్చుకుంది. టీ20 సిరీస్ లో వారిది ఇది మొదటి విజయం మాత్రమే.. ప్రస్తుతానికి 1-1తో సిరీస్ ను సమం చేయగలిగారు. మూడో టీ20 హైదరాబాద్ లో 13వ తేదీన జరగనుంది.

About the author

Related

JOIN THE DISCUSSION