ఈ విద్యార్థినుల‌కు ఏమైంది?

జీవితంపై విర‌క్తి చెందిన విద్యార్థిని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న చోటు చేసుకున్న కొన్ని గంట‌ల త‌రువాత‌.. మ‌రో విద్యార్థిని కూడా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆ విద్యార్థిని పేరు తోట సంయుక్త‌. వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలే.

చదువు కోవడం ఇష్టం లేక మనస్తాపానికి గురై సంయుక్త ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు చెబుతున్న‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన కార‌ణం ఉండే ఉంటుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఈ ఘ‌ట‌న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాకు చెందిన సంయుక్త చదువుకోవ‌డానికి హైద‌రాబాద్‌కు వ‌చ్చింది.

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంట‌ర్మీడియ‌ట్‌లో చేరింది. తల్లిదండ్రుల బలవంతంతో చదువుకోవడానికి అంగీకరించింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.

ఇటీవ‌లి కాలంలో రాసిన ప‌రీక్ష‌ల్లో మార్కులు తక్కువ రావడంతో మనస్తాపానికి గురై హాస్టల్ లోని రెండ‌వ‌ అంతస్థులోని రూమ్ నంబరు 202 లో సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని చనిపోయింది. తోటి విద్యార్థినులు ఈ విష‌యాన్ని కళాశాల ఉపాధ్యాయులకు తెలియ‌జేశారు.

వెంటనే వారు సంయుక్త‌ను మాక్స్ క్యూర్ ఆసుప‌త్రికి తరలించారు. అప్ప‌టికే సంయుక్త మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. అనంత‌రం మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్ కోసం కోసం ఉస్మానియా ఆసుప‌త్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

About the author

Related

JOIN THE DISCUSSION