ప్రపంచంలోనే దారుణ హింసకు గురవుతున్న ముస్లింలు వీరు.. వారి గురించి 4 ముఖ్యమైన విషయాలు..!

రోహింగ్యా ముస్లింలు గత కొద్ది రోజులుగా వీరి గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. రోహింగ్యా ముస్లింల ఊచకోతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మయన్మార్ కు చెందిన వీరి జనాభా 1.1 మిలియన్లు.. చాలా దేశాల జనాభా కంటే ఎక్కువే.. అయినా వీరి బ్రతుకులు అంధకారంలో నిండిపోయాయి. 1982 నుండి వారికి ఆ దేశ పౌరసత్వం అనేదే లభించలేదు. కనీసం తమకు స్వాతంత్ర్యం లభించాలని కూడా వారు పోరాడకూడదని ఆంక్షలు విధించారు. విద్యా, ఉద్యోగాలు అసలు ఆ వైపు కూడా వీరిని రానివ్వరు.. చాలామంది ప్రాణాలను అరచేత పెట్టుకొని వివిధ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం వారి గురించే ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మన దేశంలోని ముస్లింలు కూడా వారికి జరుగుతున్న అన్యాయంపై పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారి గురించి మీరు తెలుసుకోవలసిన 4 ముఖ్యమైన విషయాలు..

1.రోహింగ్యా ముస్లింలు ఎవరు

మయన్మార్ దేశంలో వీరంతా ఎనిమిదవ శతాబ్దం నుండి నివసిస్తున్నారు. మయన్మార్ లో ఉన్న 135 మైనారిటీ కమ్యూనిటీలలో వీరు కూడా ఒకరు. వీరు బంగ్లాదేశ్ మాండలికంలో మాట్లాడుతారు. మయన్మార్ లోని రఖినే రాష్ట్రంలో వీరు ఎక్కువగా నివసిస్తున్నారు. తాము అరబ్బుల వంశానికి చెందిన వారమని అరాకన్ వ్యాలీలో కొన్ని సంవత్సరాల క్రితమే స్థిరపడ్డామని చెబుతుంటారు. ఇక మయన్మార్ లో బౌద్ధులు ఎక్కువగా ఉంటారు. వారితో పాటే వీళ్ళు కూడా నివసిస్తున్నప్పటికీ వీరు ఇల్లీగల్ గా తమ దేశంలోకి ప్రవేశించి బ్రతుకుతున్నారని వారి వాదన. అయితే మయన్మార్ చరిత్రలో రోహింగ్యా ముస్లింల గురించి ఉంది. ఎందరో నేతలు, పొలిటికల్ లీడర్లు, చదువుకున్న వారు.. రోహింగ్యా ముస్లింలలో ఉన్నారు.

2.ఇంత దారుణంగా వారిని హింసించడానికి కారణమేమిటి
గత కొన్నేళ్లుగా వారిని మయన్మార్ పౌరులుగా గుర్తించకపోయినా వారిని చిత్ర హింసలకు గురిచేయడం మొదలుపెట్టారు. తమ సైన్యానికి కావాల్సిన తిండి కోసం రోహింగ్యా ముస్లింల మీద పడుతున్నారు మయన్మార్ సైనిక దళాలు. రోహింగ్యా ముస్లింలు పెంచుకుంటున్న పంటలను వీరు దోచుకుంటున్నారు. అలాగే సరైన జీతాలు కూడా ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మయన్మార్ ఆర్మీ అరాచకాలు మరింత ఎక్కువయ్యాయి. పిల్లలను, మహిళలను కూడా హింసించడం మొదలుపెట్టారు. వారు చేస్తున్న ఈ దుర్మార్గాలకు మయన్మార్ ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది.

3.ఇదేమీ మొదటిసారి కాదు
1991-92 ప్రాంతంలో కూడా ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. అప్పట్లో 250000 మంది రోహింగ్యా ముస్లింలు మయన్మార్ నుండి బంగ్లాదేశ్ కు వలస వెళ్ళారు. వీరిని కాపాడాలని కొందరు నేతలు పోరాడుతున్నప్పటికీ వారి మాటలను ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంతో చాలా దారుణ పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు.

4. ఇటీవల మారణహోమం జరగడానికి కారణం ఏమిటి..!

అక్టోబర్ 9, 2016న రోహింగ్యా ముస్లింలు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. 9 మంది పోలీసులను రఖినే రాష్టంలో మట్టుబెట్టారు. హరాఖా-అల్-యాఖిన్ అనే రోహింగ్యా మిలిటెంట్ల సంఘం ఈ ఘటనకు బాధ్యులుగా ప్రకటించుకుంది. దీంతో మిలటరీ ఉత్తర రఖినేలో ఉంటున్న రోహింగ్యా ముస్లింలపై విరుచుకుపడ్డారు. 1200 ఇళ్ళను తగులబెట్టారు. ఎందఱో మహిళలపై అత్యాచారాలు చేశారు. హెలికాప్టర్ల ద్వారా రోహింగ్యా ముస్లింలను చంపడం మొదలుపెట్టారు.

దాదాపు 200 మంది రోహింగ్యా ముస్లింలు తమకు జరిగిన అన్యాయాలను ఇంటర్వ్యూ రూపంలో తెలియజేశారు. అలాగే 423 మందిని పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసారు. చనిపోయిన వారి సంఖ్య ఎంతో ఇంకా తెలీలేదు.

ఆగస్ట్ 25, 2017న మరోసారి రోహింగ్యా మిలిటెంట్లు పోలీసులు, ప్రభుత్వ ఆఫీసులపై దాడి చేయడం మొదలుపెట్టారు. దీంతో మిలటరీ రంగంలో దిగి కనపడ్డ రోహింగ్యా ముస్లింలను చంపుకుంటూ వెళుతోంది.

 

About the author

Related

JOIN THE DISCUSSION