స్పోర్ట్స్ కారు కొన్న ఆరో రోజే..!

ఆమె ఓ టాప్ మోడ‌ల్‌. 22 ఏళ్ల చిరుప్రాయంలో ఫ్యాష‌న్ ప్ర‌పంచం దృష్టిని త‌న వైపు తిప్పుకొంది. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇలా వ‌చ్చిన ఆదాయంతో ఆరు రోజుల కింద‌టే స్పోర్ట్స్ కారును కొనుగోలు చేసింది. కారును కొనుగోలు చేసిన ఆరోరోజు.. అది ఘోర రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. ఆ మోడ‌ల్‌తో పాటు కారులో ఉన్న ఆమె సోద‌రులు కూడా దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

ఆ మోడ‌ల్ పేరు బ్రీ కెల్ల‌ర్‌. 22 సంవ‌త్స‌రాలు. ఇప్పుడిప్పుడే ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ గుర్తింపు పొందారు. టాప్ మోడ‌ల్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. ఆమె హెయిర్ స్ట‌యిలిస్ట్ కూడా. సిడ్నీలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. డార్లింగ్ హార్బ‌ర్ నుంచి వెళ్తుండ‌గా.. గౌల్బ‌బ‌ర్న్ స్ట్రీట్‌లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. త‌న ఇద్ద‌రు సోద‌రుల‌తో క‌లిసి స్పోర్ట్స్ కారులో ఇంటికి వెళ్తుండ‌గా.. అదుపు త‌ప్పింది.

అతి వేగంగా డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. ప‌ల్టీలు కొడుతూ రోడ్డు వార‌గా ప‌డిపోయింది. ఇంధ‌న ట్యాంకు ప‌గిలడంతో వెంట‌నే మంట‌లు అంటుకున్నాయి. బ్రీ కెల్ల‌ర్‌తో పాటు ఆమె ఇద్ద‌రు సోద‌రులు కూడా బ‌య‌టికి రాలేక‌పోయారు. కారు ప‌ల్టీలు కొట్ట‌డం వ‌ల్ల లోప‌లే చిక్కుకుపోయారు.

ఈ సంద‌ర్భంగా చెల‌రేగిన మంట‌ల్లో చిక్కుకుని సంఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న బ్రీ కెల్ల‌ర్ అభిమానుల‌ను విషాదంలో ముంచెత్తింది. ఇందులో అత్యంత విషాద‌క‌ర‌మేంటంటే- ఆ స్పోర్ట్స్ కారును కేవ‌లం ఆరు రోజుల కింద‌టే ఆమె కొనుగోలు చేసింది. త‌న సొంత డ‌బ్బుతో ఎంతో ఇష్ట‌ప‌డి కొన్న కారు అది.

 

About the author

Related

JOIN THE DISCUSSION