అబ‌ద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకున్న డాక్ట‌ర్‌గారికి భార్య ఘ‌న `స‌న్మానం`

మొద‌టి భార్య జీవించి ఉండ‌గానే ఓ డాక్ట‌ర్‌గారు రెండో పెళ్లి చేసుకున్నారు. అది కూడా గుట్టు చ‌ప్పుడు కాకుండా! రెండు నెల‌ల పాటు కాపురం కూడా చేశాడు. మొద‌టి భార్య చ‌నిపోయింద‌ని అబ‌ద్ధం చెప్పి మ‌రీ.. రెండో పెళ్లి చేసుకున్నాడాయ‌న‌.

కొద్దిరోజుల త‌రువాత ఈ విష‌యం రెండో భార్య‌కు తెలిసింది. ఇక ఊరుకుంటుందా? ఛాన్సే లేద‌నుకుంటున్నారా? అదే జ‌రిగింది ఇక్క‌డ కూడా. నేరుగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి భ‌ర్త‌పై ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న కర్ణాట‌క‌లోని ధార్వాడలో చోటు చేసుకుంది.

డాక్ట‌ర్ సంతోష్ వ‌లాండిక‌ర్ అనే వ్య‌క్తి ధార్వాడ‌లోని బ‌స‌వ‌న‌గ‌ర లే అవుట్‌లో నివాసం ఉంటున్నాడు. అక్క‌డే క్లినిక్‌ను న‌డిపిస్తున్నాడు. అత‌ను వివాహితుడు.

అయిన‌ప్ప‌టికీ- మొద‌టి భార్య చ‌నిపోయింద‌ని అబ‌ద్ధం చెప్పి, విజ‌యపుర‌కు చెందిన సుశీల (పేరు మార్చాం)ను ఆగ‌స్టులో రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఆమెను ధార్వాడ‌కు తీసుకొచ్చాడు. కొద్దిరోజుల కింద‌ట ఆమెను వెంట‌బెట్టుకుని విజ‌య‌పుర‌కు వెళ్లాడు. అక్క‌డ ఆమెను పుట్టింట్లో వ‌దిలిపెట్టి ఒంట‌రిగా ధార్వాడ‌కు వ‌చ్చాడు సంతోష్‌.

ఆ త‌రువాత ఆమె ప‌లుమార్లు ఫోన్ చేసిన‌ప్ప‌టికీ స్పందించేవాడు కాదు. ఒక్కోసారి ఫోన్‌లో మాట్లాడి.. త‌న‌కు వీలు కావ‌ట్లేద‌ని, మ‌రోసారి వ‌చ్చి తీసుకెళ్తాన‌ని నమ్మించేవాడు.

ఇలా రెండు నెల‌ల పాటు కాలం గ‌డిపాడు. ఓ సారి సుశీల ఫోన్ చేసిన‌ప్పుడు సంతోష్ మొద‌టి భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. దీనితో సుశీల‌కు అస‌లు విష‌యం తెలిసింది. దీనితో ఆమె నేరుగా ధార్వాడ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి సంతోష్‌పై ఫిర్యాదు చేసింది.

త‌న‌ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడ‌ని కేసు పెట్టింది. ఈ లోగా సంతోష్ కూడా అక్క‌డికి వ‌చ్చాడు. దీనితో ఇద్ద‌రి మ‌ధ్యా వాగ్వివాదం చెల‌రేగింది. పోలీసుల ముందే భర్త‌గారికి ఘ‌న స‌న్మానం చేసిందామె. ఇద్ద‌రూ కొట్టుకున్నారు. అనంత‌రం పోలీసులు వారిని శాంతింప‌జేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. కేసు న‌మోదు చేశారు.

About the author

Related

JOIN THE DISCUSSION