భ‌ర్త అడ్డు తొల‌గించుకోవ‌డానికి కుట్ర..బ‌ట్ట‌బ‌య‌లు..!

కొన్నాళ్లుగా వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తున్న ఓ మ‌హిళ‌.. త‌న భ‌ర్త‌ను హ‌త‌మార్చడానికి కుట్ర ప‌న్నింది. త‌న ప్రియుడితో క‌లిసి ఆ మ‌హిళ త‌న‌కు తాళి క‌ట్టిన భ‌ర్త‌ను క‌డ‌తేర్చడానికి స్కెచ్ వేసింది. అది కాస్తా విఫ‌లం కావ‌డంతో.. ఆమె గుట్టంతా ర‌ట్ట‌యింది. ఊచ‌లు లెక్కిస్తోంది. బెంగ‌ళూరులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

శైల‌జ అనే మ‌హిళ‌కు అయిదేళ్ల కింద‌ట ప్ర‌స‌న్న‌కుమార్ అనే వ్య‌క్తితో పెళ్ల‌యింది. బెంగ‌ళూరు ఇందిరాన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమెకు ఆనంద్ అనే వ్య‌క్తితో పరిచ‌యం ఏర్ప‌డింది. అది అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. త‌ర‌చూ ఆనంద్‌.. శైల‌జ ఇంటికి వ‌చ్చేవాడు.

ఆరునెల‌ల కింద‌ట ఈ విష‌యం ప్ర‌స‌న్న‌కు తెలిసింది. దీనితో అత‌ను శైల‌జ‌ను నిల‌దీశాడు. ఇద్ద‌రి మ‌ధ్యా వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అప్ప‌టి నుంచి శైల‌జపై ఆంక్ష‌లు విధించాడు ప్ర‌స‌న్న‌కుమార్‌. దీనితో విసిగిపోయిన ఆమె త‌న భ‌ర్త‌ను హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని ఫోన్ ద్వారా ఆనంద్‌కు వివ‌రించింది.

ఈ ఘాతుకానికి అత‌ను కూడా అంగీక‌రించ‌డంతో.. ఇద్ద‌రూ క‌లిసి కుట్ర ప‌న్నారు. మొద‌ట భోజ‌నంలో నిద్ర‌మాత్ర‌ల‌ను క‌లిపారు. ఆ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. ఆ రోజు రాత్రి ప్ర‌స‌న్న‌కుమార్ భోజ‌నం చేయ‌లేదు.

ఈ కుట్ర విఫ‌ల‌మైంద‌ని, ఆ త‌రువాత ఏం చేద్దామంటూ శైల‌జ‌.. ఫోన్‌లో ఆనంద్‌ను సంప్ర‌దించింది. శైల‌జ‌-ఆనంద్ మ‌ధ్య సాగిన ఈ ఫోన్ సంభాష‌ణ అంతా ఆమె ఫోన్‌లోనే రికార్డ‌య్యింది. దీన్ని విన్న ప్ర‌స‌న్న‌కుమార్ నేరుగా జ్ఞాన‌భార‌తి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాడు. ఈ సంభాష‌ణ‌ను పోలీసుల‌కు వినిపించాడు. దాన్ని సాక్ష్యంగా ప‌రిగ‌ణించిన పోలీసులు శైల‌జ‌, ఆనంద్‌ల‌ను అరెస్టు చేశారు.

About the author

Related

JOIN THE DISCUSSION