దుప్ప‌టి క‌ప్పుకొని నిద్ర‌పోతోంద‌నుకున్నారు..!

త‌మిళ‌నాడులోనీ ఊటీ నుంచి నాగ‌ర్ కోయిల్‌కు బ‌య‌లుదేరింది బ‌స్సు. ఉద‌య‌మే ఆ బ‌స్సు నాగ‌ర్‌కోయిల్‌కు చేరుకుంది. ప్ర‌యాణికులంద‌రూ దిగిపోయారు. మ‌ధ్య సీట్ల‌ల్లో ఓ యువ‌తి నిద్ర‌పోతుండ‌టాన్ని గ‌మ‌నించారు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌. చున్నీ కప్పుకొని గాఢ‌నిద్ర‌కు వెళ్లింద‌ని అనుకున్నారు. ఆమె వ‌ద్ద‌కు వెళ్లి లేప‌డానికి ప్ర‌య‌త్నించారు.

ఒక‌ట్రెండు సార్లు పిలిచినా ఆమె క‌ద‌ల్లేదు, మెద‌ల్లేదు. మ‌రోసారి గ‌ద్దించారు. అయినా ఆమె నుంచి ఉలుకు లేదు ప‌లుకు లేదు. దీనితో అనుమానం వ‌చ్చిన డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ దుప్ప‌టి తొల‌గించారు. ఆ యువ‌తి శ‌వ‌మై క‌నిపించింది. నోరు, ముక్కు నుంచి నుర‌గ‌లు వ‌స్తుండ‌టాన్ని గుర్తించారు. వెంటనే ఈ విష‌యాన్ని వడచ్చేరి పోలీసులకు తెలియ‌జేశారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు..యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె బ్యాగును పరిశీలించారు. అందులో ఉన్న ఓ గుర్తింపు కార్డు ద్వారా ఆ యువతి కోయంబత్తూరు జిల్లా శెట్టియార్‌తోటం గ్రామానికి చెందిన ముత్తుసెల్విగా గుర్తించారు. కోయంబత్తూర్‌లోని ఓ నగల దుకాణంలో పని చేస్తోంది.

త‌న స‌మీప బంధువు వివాహం ఉండ‌టంతో వారం రోజుల పాటు సెలవు తీసుకుంది. సెల‌వును మరో రెండు రోజులు పొడిగించుకుందట‌. అదే స‌మ‌యంలో ఆమె పని చేస్తున్న విభాగం నుంచి వేరే విభాగానికి మార్చడంతో మనస్తాపం చెందిందని, ఆమె నాగ‌ర్ కోయిల్‌కు వెళ్లే సమయంలో విష పూరిత ద్రావకం తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు నాలుగు నెలల క్రితం వివాహమైంది.

About the author

Related

JOIN THE DISCUSSION