చ‌నిపోతానంటూ లేఖ రాసి ఇల్లొదిలి వెళ్లింది.. జంట‌గా తిరిగొచ్చింది..!

కొద్దిరోజుల కింద‌ట గుంటూరుజిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో సంచ‌ల‌నం రేపిన రాసంశెట్టి శ్రీ‌ల‌క్ష్మి అదృశ్యం మిస్ట‌రీ వీడిపోయింది. ఒంట‌రిగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆ యువ‌తి జంట‌గా తిరిగొచ్చింది. వ‌డ్డ‌ప‌ల్లిలో నివ‌సించే అజయ్‌కుమార్, లక్ష్మికి నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహ‌మైంది. రెండేళ్ల కింద‌ట అజయ్‌కుమార్‌ అనారోగ్యంతో మృతి చెందాడు.

లక్ష్మి కూడా త‌ర‌చూ అనారోగ్యానికి గుర‌వుతోండేది. ముగ్గురు కుమార్తెలు ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చివరి కుమార్తె అయిన శ్రీలక్ష్మి ఇంటర్మీడియట్‌ చదువుకుని కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది. డిగ్రీ పూర్తి చేయాల‌ని, కుటుంబానికి అండ‌గా ఉండాల‌ని ఆమె ఇద్ద‌రు అక్కలు ఒత్తిడి తెస్తుండేవారు.

దీనితో మనస్తాపానికి గురైన శ్రీలక్ష్మి కింద‌టి నెల 16న ఇంట్లోంచి వెళ్లిపోయింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని, తన శరీరం కూడా దొరకదని రెండు పేజీల లేఖ రాసింది. దీనితో కుటుంబ సభ్యులు ఆందోళనకు గుర‌య్యారు. స‌త్తెన‌ప‌ల్లి టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వారి ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే ఈ నెల 11న శ్రీ‌ల‌క్ష్మి ఉనికి దొరికింది.

ఆమే స్వ‌యంగా తాను ఎక్క‌డ ఉన్న‌దీ వెల్ల‌డించింది. యానాంలో ఉన్న‌ట్లు పేర్కొంటూ ఫేస్‌బుక్‌ ద్వారా మెసేజ్‌ పంపింది. తాను సురక్షితంగా ఉన్నానని, పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలిపింది. ఈ విష‌యాన్ని ఆమె కుటుంబ స‌భ్యులు పట్టణ పోలీసులకు తెలియ‌జేశారు.

ఫేస్‌బుక్‌లో త‌న‌కు పరిచయమైన యానాంకు చెందిన‌ ఈశ్వరప్రసాద్‌ వద్దకు వెళ్లిపోయింది. వారు వివాహం చేసుకున్నారు. బుధవారం శ్రీలక్ష్మితోపాటు ఈశ్వర ప్రసాద్‌లను పోలీసులు తీసుకొని జిల్లా రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు వద్దకు తీసుకెళ్లారు. అనంతరం సత్తెనపల్లి పోలీస్టేషన్‌కు తీసుకు వచ్చారు.

About the author

Related

JOIN THE DISCUSSION